వీరశైవం మూలస్థానం కొలనుపాక - 1
భారతావనిలో వైదికమతం వెనుకంజ వేసిన తరుణంలో ఆయా కాలాల్లో ఎందఱో మహాత్ములు జనించి, సనాతన భారతీయ ధర్మాన్ని సందర్భాన్ని బట్టి నూతన పంథాలో పునరుద్దరించి ప్రజలని జాగృతపరచటం జరిగింది - నిజానికి ఆయా మతాల పరమోద్దేశం అదే. ఆది శంకరులు కేరళలో జన్మించి, అవైదికమతాలను ఖండించి, అద్వైతమత సిద్దాంతాన్ని ప్రతిపాదించి - పంచాయతన పూజను ప్రవేశ పెట్టి వైదిక ధర్మాన్ని పునరుద్దరించడం జరిగింది. తరువాత ఎంతోమంది మహాపురుషులు ఈ భారతావనిపై ఆయా కాలాల్లో అవతరించి తమ ప్రభోదాలతో ప్రజలను సన్మార్గ పంథాలో తీసుకువెళ్లటం జరిగింది.
ఆ కోవలోనే రేణుకాచార్యులు వారు నేటి తెలంగాణాలోని నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉద్భవించి శక్తివిశిష్టాద్వైతాన్ని ప్రభోదించడం జరిగింది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు.
మిగతా పీఠాలు:-
ఉజ్జయిని-మరుళారాధ్య
కేదారనాథ్-ఎకోరామారాధ్య
శ్రీశైల-పండితారాధ్య
కాశీ-విశ్వారాధ్యులు
వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు.
కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది.
కాశీలో ఉన్న మఠాల అన్నిటిలోకి అతిపెద్దది, అతిపురాతనమైనదీ కాశీ జంగమవాడి మఠం. మొఘల్ సామ్రాజ్య కాలంలో కూడా ఈ మఠానికి విశిష్టస్థానం లబించటం, అక్భర్, షాజహాన్ ఆదిగాగల మొఘల్ రాజులందరూ ఎన్నో దానాలను ఈ మఠానికి సమర్పించారు. ఇట్టి విశేషమైన మఠానికి తరువాతికాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన చిదేరేమఠం వీరభద్రశర్మ గారు (తెలంగాణలో విభూతి పత్రికను నడిపారు) మఠాధిపతిగా విరాజిల్లటం జరిగింది.
రేణుకాచార్యుడు ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు క్రీ.శ.900 ప్రాంతంలో "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.
ఈ గ్రంధమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము. ఈ సిద్దాంత శిఖామణి గూర్చి తరువాత పలు గ్రంధాలలో ప్రస్తుతించటం జరిగింది. బ్రహ్మసూత్రములకు భాష్యము - శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోన్నాడు. వీరు క్రీ.శ. 960 ప్రాంతమునకు చెందినవాడు. వీరు సిద్దాంతశిఖామణిని ప్రస్తావించుటన అతనికి పూర్వమే ఈ గ్రంధము వెలువడినదని చెప్పవచ్చు.
శ్రీపత్ పండితుడు తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.
అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:
"పవిత్రంతే" - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్ అని
"రేణుక భగవత్పాద చార్యేణాపి" - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు.
అంతేగాక శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములను ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట జరిగింది.
శ్రీకంఠ శివాచార్యులు తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున:
సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది.
ఇంకనూ ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" , "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంధములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదాహరించుట జరిగింది.
అలాగే రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.
అలాగే రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.
No comments:
Post a Comment