Sunday, June 26, 2016

Literature

నిజానికి వీరశైవము గూర్చి పూర్వకాలంలో తెలుగులోనే ఎక్కువగా గ్రంధాలు వెలువడ్డాయి. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, శివతత్వసారమ్ ఆదిగా ఎన్నో కలవు. ఆధునిక కాలంలో ఐతిహాసిక సామ్రాట్ శివశ్రీ బండారు తమ్మయ్య గారు (ఆంధ్ర సారస్వత పరిషత్ అద్యక్షులు) వీరశైవ సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం (వివిధ పత్రికల్లో లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు, పలు గ్రంధాలు ప్రచురించి వీరశైవ తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు). అలాగే పండిత శ్రీ చిదిరేమఠం వీరభద్ర శర్మ గారు (పిదప్ కాశీ జ్ఞాన సింహాసనాన్ని అధిష్టించి జగద్గురువులైనారు) విభూతి మాస పత్రికను 1939 లో స్థాపించి వీరశైవ వెలుగులు ప్రసరింప జేశారు, పలు గ్రంధాలు ప్రచురించారు, అంతే గాక వీరశైవాన్ని తూలనాడే పలువురు పండితులతో ఎన్నో వాదనలు జరిపి విజయాలు సాధించి వీరశైవ జగతిలో విశిష్టతను పొందారు. శ్రీశైల సూర్య సింహాసనాదీశ్వరులైన శ్రీ వాగీశ పండిత శివాచార్యులు కూడా పండితులు, కవి, విద్వాంసులు అగుటచేత ఎన్నో వీరశైవ గ్రంధాలను ప్రచురించి వెలుగులోకి తెచ్చారు. శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు వీరశైవ సాహిత్యానికి ఎంతో గొప్ప సేవ చేశారు-వారి సేవ అనన్యం. శివశ్రీ  ధూపం బసవనాగయ్య గారు వీరశైవ సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం. శివశ్రీ Dr. K.M. రుద్రప్ప గారు ఎన్నో గ్రంధాలను ప్రచురించి వీరశైవ సాహిత్యంలో ఒక  ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. శివశ్రీ పండిత పెద్దమఠం రాచవీరదేవర గారు కూడా వీరశైవ సాహిత్య వికాసానికే తమ ఆస్తినంతా ధారపోసి ధన్యులైనారు. మరెందరెందరో వీరశైవ సాహిత్య వికాసానికి వేశేష కృషి సల్పారు (వారందరి గురించి ముందు ముందు ప్రత్యేకంగా వివరించగలను).

ప్రస్తుత కాలంలో ఎందరో వీరశైవ సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి ఎన్నో విధాల కృషి చేస్తున్నారు, అయినా వెలుగు చూసింది చాలా తక్కువే అని చెప్పాలి. శ్రీ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వరులైన జగద్గురు Dr.చంద్రశేఖర శివాచార్యుల వారు వీరశైవ వికాసానికి చేస్తున్న అపార కృషి అనన్యం. స్వయంగా పండితులగుట చేతనూ, సాహిత్యాభిలాషులగుట చేతనూ ఎన్నో గ్రంధాలను వెలుగులోకి తేవడమే కాకుండా పండితులకు పామరులకు కూడా ఉపయోగపడేలా చేస్తున్నారు. వీరు సాగిస్తున్న వీరశైవ మతోద్దరణ వేశేష శ్లాఘనీయం. భారతదేశమంతటనే గాక పరాయి దేశాల్లోనూ వీరు వీరశైవ మతానికి విశిష్టతను తెస్తున్నారు. మారుతున్న కాలానికనుగుణముగా వెబ్ ప్రపంచంలోనూ వీరశైవాన్ని చాటి చెబుతున్నారు. వీరి మూలకంగానే పరాయి దేశస్థులు కూడా వీరశైవ మతమును స్వీకరించి ఒక website కూడా ఉంచడం విశేషమే (http://veerashaiva.ru).

No comments:

Post a Comment